పోలీసుల సమాచారం ప్రకారం, 18-02-2026న చాకలి గణేష్ తనపై దాడి జరిగిందని, కుటుంబ సభ్యులను దూషించారని గ్రామస్తులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును మొదట నాన్-కాగ్నిజబుల్‌గా నమోదు చేసి జనరల్ డైరీలో ఎంట్రీ చేసినట్లు తెలిపారు. అనంతరం u/s 115(2), 352 r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేసేందుకు కోర్టు అనుమతి కోరినట్లు వెల్లడించారు.
అదే రోజు రాత్రి 8:30 గంటలకు ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి తనపై రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదు చేయగా, Cr. No. 53/2026 కింద కేసు నమోదు చేశారు.
తదుపరి 21-02-2026న గణేష్ భార్య చిలికేశ్వరం మౌనిక ఫిర్యాదు చేస్తూ, జాతరలో జరిగిన దాడి కారణంగా రెండు నెలల శిశువు మృతి చెందినట్లు ఆరోపించారు. దీనిపై Cr. No. 60/2026 u/s 174 BNSS కింద కేసు నమోదు చేసి శిశువుకు పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో నిన్న నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా జరగగా, మౌనిక మరో ఫిర్యాదు అందించారు. చంపాలనే ఉద్దేశంతో దాడి చేశారని, కులం పేరుతో దూషించారని పేర్కొనడంతో Cr. No. 61/2026 కింద కేసు నమోదు చేశారు. కేసులో కొందరు నిందితులను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్‌కు తరలించినట్లు SDPO తెలిపారు. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.: కుమ్మెర ఘటనలపై నిందితుల అరెస్ట్
