నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించకపోతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఆదివారం కుమ్మెర గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం డీఎస్పీ శ్రీనివాసన్ను కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం నాగర్ కర్నూల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు మాట్లాడుతూ, బీసీ సామాజిక వర్గానికి చెందిన గణేష్ కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు సమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా నిష్పక్షపాత విచారణ జరిపి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పోలీసులను కోరారు. దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి ఎక్స్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ, దర్శనానికి వెళ్లే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని ప్రశ్నించినందుకే గణేష్ కుటుంబంపై దాడి జరిగిందని ఆరోపించారు. నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని, లేనిపక్షంలో బీసీ మహిళా కమిషన్తో పాటు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రం గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.: కుమ్మెర ఘటనపై బీజేపీ ఓబీసీ మోర్చా ఆగ్రహం
