నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని మూడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను (కేజీబీవీ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (YIIoE)గా ఎంపిక చేసి విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టింది.
జిల్లాలో మొత్తం 20 కేజీబీవీలు ఉన్నాయని, వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని కేజీబీవీల్లో సుమారు 6,262 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ నేపథ్యంలో బిజినపల్లి కేజీబీవీలో సిఎల్ఏటి (CLAT), లాసెట్ (LAWCET) వంటి న్యాయ కోర్సులకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వెల్దండ కేజీబీవీలో నీట్ (NEET), ఎప్సెట్ (EAPCET), అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించిన కోచింగ్ అందించనున్నారు. అలాగే నాగర్ కర్నూల్ కేజీబీవీలో ఐఐటీ–జేఈఈ (IIT–JEE) పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ నిర్వహించనున్నారు.
ఎంపికైన ఈ ఎక్స్‌లెన్స్ కేంద్రాల్లో నిపుణులైన అధ్యాపకుల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. విద్యార్థులకు గ్రంథాలయం, స్టడీ మెటీరియల్, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు పోటీ పరీక్షలకు అనుగుణంగా ప్రత్యేక అకడమిక్ ప్రణాళిక అమలు చేయనున్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రాత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష మే 5న నిర్వహించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి ఎక్స్‌లెన్స్ కేంద్రాల్లో ప్రవేశం కల్పించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థులు హైదరాబాద్, మహబూబ్‌నగర్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన కోచింగ్ పొందే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కేజీబీవీల పర్యవేక్షణ అధికారిని ఇ. శోభారాణి సూచించారు.: జిల్లాలో మూడు కేజీబీవీలు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *