నాగర్ కర్నూల్ జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో పాటు గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీటీలు పాల్గొన్నారు. జిల్లాలో గ్యాస్ సరఫరా పరిస్థితి, రోజువారీ పంపిణీ ప్రక్రియ, నిల్వలు తదితర అంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 17 గ్యాస్ ఏజెన్సీల ద్వారా జరుగుతున్న పంపిణీ ప్రక్రియపై అధికారులు నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. గ్యాస్ బుకింగ్, స్టాక్ వివరాలను ప్రతిరోజు సమర్పించాలని సూచించారు. జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటి సంస్థలకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులు, రోగులు మరియు వారి అటెండెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరఫరా ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
జిల్లాలో గృహ అవసరాల కోసం ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించినా లేదా అక్రమంగా నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం పౌర సరఫరాల శాఖ అధికారులు, డీటీలు, పోలీసు అధికారులు కలిసి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు హోటళ్లు, రెస్టారెంట్లు మరియు వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించనున్నాయి.
హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే నిత్యావసర సరకుల చట్టం–1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింహారావు, డీఎం సివిల్ సప్లై రాజేందర్, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థల అధికారులు, జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు.: ఎల్పీజీ గ్యాస్‌పై కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *