రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్‌తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాలను వినియోగించి తయారు చేసిన వివిధ రకాల ఆకర్షణీయమైన వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్‌ను కలెక్టర్ పరిశీలించారు. మహిళలు తయారు చేసిన హస్తకళా ఉత్పత్తులు, అలంకరణ వస్తువులు మరియు గృహ వినియోగ వస్తువులను కలెక్టర్‌కు వివరించారు.
ప్రత్యేకంగా పాత టైర్లను వినియోగించి తయారు చేసిన పూల కుండీలు కలెక్టర్‌ను ఆకట్టుకున్నాయి. రంగురంగులుగా అలంకరించి రూపొందించిన ఈ కుండీలు ఇంటి పరిసరాలను అందంగా తీర్చిదిద్దడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాలను పునర్వినియోగం చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు మహిళలకు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.
మహిళల సృజనాత్మకతతో తయారైన ఉత్పత్తులను పరిశీలించిన కలెక్టర్ బాదావత్ సంతోష్ మహిళా సంఘాల సభ్యులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడటమే కాకుండా సమాజంలో పర్యావరణంపై అవగాహన పెంచడానికి కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
మహిళలు తమ ప్రతిభను మరింతగా వినియోగించి వినూత్నమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ ద్వారా ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇలాంటి ప్రయత్నాలు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ అహ్మద్ హుస్సేన్, సంబంధిత అధికారులు, మెప్మా సిబ్బంది మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.: సృజనాత్మకతతో మహిళలు వ్యాపార అభివృద్ధి




