నాగర్ కర్నూల్ పట్టణంలో గ్లూకోమా (నీటి కాసుల వ్యాధి) వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవితకాలం పాటు కంటి చూపును సంరక్షించుకోవాలని ఆప్తాలమిక్ అధికారి కోట్ర బాలాజీ సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు తూడుకుర్తి ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ద్వారా గ్లూకోమా వ్యాధి లక్షణాలు, దాని తీవ్రత మరియు ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆప్తాలమిక్ అధికారి కోట్ర బాలాజీ మాట్లాడుతూ గ్లూకోమా వ్యాధి ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా, నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి కంటి సమస్యలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అలాగే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్–A పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. క్యారెట్, పాలకూర, ఆకుకూరలు వంటి పోషకాహారం కంటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తూడుకుర్తి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి పరిపాలనాధికారి ప్రేమ్ కుమార్, సిబ్బంది రాజు, లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కార్యదర్శి సురేష్, వాకింగ్ వండర్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు పడిగే తిరుపతయ్యతో పాటు క్లబ్ సభ్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు ర్యాలీలో పాల్గొని గ్లూకోమా వ్యాధిపై అవగాహన కల్పించారు.: గ్లూకోమా నివారణపై అవగాహన అవసరం: ఆప్తాలమిక్ అధికారి కోట్ర బాలాజీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *