నాగర్‌కర్నూల్ జిల్లాలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను మరియు గుత్తేదారులను ఆదేశించారు. గురువారం నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని వనపట్ల, గన్యాగుల, పెద్ద ముద్దునూరు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇళ్ల వద్ద మిగిలి ఉన్న పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఇంకా పూర్తి కాకుండా మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పెయింటింగ్, ఎలక్ట్రికల్, డ్రైనేజీ వంటి మౌలిక పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులైన ప్రజలకు ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ తెలిపారు.

ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లను అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా పిడి హౌసింగ్ సంగప్ప, నాగర్‌కర్నూల్ ఎంపీడీవో, ఆయా గ్రామాల సర్పంచులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *