భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ముగ్గురు కోర్టు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి రూ.5,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన వారిలో పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీత ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. న్యాయవాది సీహెచ్ గోపాలరావు ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటున్న సమయంలోనే ముగ్గురిని పట్టుకున్నారు.

ఫిర్యాదు అందిన వెంటనే ఏసీబీ బృందం పన్నాగం ప్రకారం చర్యలు చేపట్టి, జిల్లా కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించింది. లంచం నగదుతో పాటు సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ ఘటనతో జిల్లా కోర్టు పరిధిలో కలకలం రేగింది.: భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *