గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలనలో నాగర్ కర్నూల్ జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు కలసి పనిచేస్తే జిల్లా అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజా పాలనను ఆదర్శంగా నిలపాలని మంత్రి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
ఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే గ్రామాలు మరియు పట్టణాల్లో ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రభుత్వ సంక్షేమ పథకం అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాబోయే మూడు సంవత్సరాలలో ప్రభుత్వం మరింత అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో పలు ప్రణాళికలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు.
నాగర్ కర్నూల్ పట్టణ అభివృద్ధికి రూ.55 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వెల్లడించారు.
అనంతరం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రూపొందించిన 10 ప్రధాన అంశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.
అంతకుముందు నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్లు మరియు చైర్ పర్సన్లు తమ అనుభవాలను వివరించారు. తెలంగాణ సారథి కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ రెవెన్యూ అమరేందర్, జిల్లా పరిషత్ సీఈఓ దేవ సహాయం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి జ్యోతి, కల్వకుర్తి మున్సిపల్ చైర్ పర్సన్ బృంగి రత్నమాలతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.: ప్రజా పాలనతో నాగర్ కర్నూల్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలి




