బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తిశ్రద్ధలతో తిలతైల అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ విశ్వవసు సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి సందర్భంగా శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా శనిగ్రహ దోష నివారణ కోసం స్వామివారికి తిలతైల అభిషేకాలు వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు ప్రార్థనలు చేశారు.
ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఫాల్గుణ మాసంలో శనేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిచిన వారికి స్వామివారి కృప ప్రసాదమై విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన్మరీత్యా, గోచారరీత్యా శనిగ్రహ దోష నివారణ కోసం శక్తిమేరకు స్వామివారిని పూజించాలని సూచించారు.
ఈ ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి కూడా భక్తులచే రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. నందీశ్వర స్వామికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు శాంతి కుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, గ్రామ భక్తులు, మహిళలు పాల్గొన్నారు.: నంది వడ్డేమాన్‌లో శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *