అచ్చంపేట నియోజకవర్గాన్ని పర్యావరణహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం బల్మూరు మండలంలో వేగంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం శ్రీకారం చుట్టారు.
ఈ పథకం కింద గ్రామంలోని ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ఈ పథకం ద్వారా గ్రామస్తులకు ఉచితంగా విద్యుత్ లభించడమే కాకుండా, వినియోగం మించిన విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. దీంతో గ్రామస్తులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ‘గ్రీన్ ఎనర్జీ’ గ్రామంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఇప్పటికే మాచారం, వంగూరు మండలాల్లోని కొండారెడ్డిపల్లి గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయగా, ఇప్పుడు బల్మూరు మండలంలో కూడా ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి పర్యావరణహితంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పంబ రాధాకృష్ణ, గ్రామ ఉపాధ్యక్షుడు బి. వెంకటయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ శ్రీను, మాశన్న, ధర్మారెడ్డి, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఏఈలు మరియు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.: కొండారెడ్డిపల్లిలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *