2027 జనగణన నేపథ్యంలో జనాభా లెక్కల సేకరణలో భాగస్వాములయ్యే తహసీల్దార్లు, మండల విద్యాధికారులు, మండల స్థాయి సెన్సెస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డీటీలతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులకు ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మొదటి విడత జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.ఈ శిక్షణ కార్యక్రమం నేటి ఆదివారం నుండి ఈ నెల 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. హైదరాబాద్ నుండి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ బి. లాజర్, మాస్టర్ ట్రైనర్లు శివరామకృష్ణ, రాజేశ్వర్ మరియు టెక్నికల్ సపోర్ట్ టీమ్ సభ్యులు జనాభా లెక్కల గణనపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. జనాభా గణనకు ఎలా సన్నద్ధం కావాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాలి అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2011లో చివరిసారిగా జనాభా గణన నిర్వహించబడిందని గుర్తు చేశారు. వాస్తవానికి 2021లో ఈ ప్రక్రియ జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం తొలిసారిగా సాంకేతికతను వినియోగిస్తూ పూర్తిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరపనున్నట్లు తెలిపారు.జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో నివాస గృహాలు, కట్టడాలు, కుటుంబ వివరాలను సేకరిస్తారని, రెండో దశలో వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తారని చెప్పారు.
దేశంలోనే తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా జనగణన చేపట్టబడుతుందని తెలిపారు.
జనగణనలో ప్రజలు అందరూ భాగస్వాములై వాస్తవ వివరాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సేకరించిన వివరాలు ఎక్కడా బయటకు వెల్లడి కాకుండా నేరుగా సర్వర్లో భద్రపరచబడే విధంగా సాంకేతికతను వినియోగిస్తున్నామని అన్నారు. ఈసారి సెల్ఫ్ డిక్లరేషన్ విధానం కీలకమని, అధికారులు మరియు ఎన్యుమరేటర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
మొదటి దశలో నిర్వహించే గృహాల గణనలో ఇంటి నిర్మాణం, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగు నీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి అంశాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలపై మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరిస్తారని తెలిపారు.
జనగణన ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా పరిషత్ సీఈవో దేవ సహాయం, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాతతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.: 2027 జనగణన దేశాభివృద్ధికి కీలకం






